Round Table India
You Are Reading
సామాజిక విప్లవ దార్శనికుడు ‘మహాత్మా’ జోతిరావు ఫూలే
76
Features

సామాజిక విప్లవ దార్శనికుడు ‘మహాత్మా’ జోతిరావు ఫూలే

jotiba phule

 

పల్లికొండ మణికంఠ

ప్రపంచంలో ‘జ్ఞానం’ తన ఉనికిని ‘సాహిత్యం’, ‘తత్వశాస్త్రం’ ద్వారా అందరిలోకి తీసుకెళ్లిన సంగతి మనకు తెలుసు. అయితే ఇండియా లో ఈ సాహిత్యం, తత్వశాస్త్రం, ఒక వర్గం/వర్ణం దగ్గరే ఆధ్యాత్మికంగా, నైతికంగా ఉండిపోయిన సంగతి చాలా వరకు అంగీకరించే దాఖలాలు కనపడవు. ఈ సామజిక విధానం వల్ల ఆధిపత్య సంబంధాలు (power relations) ఏర్పడి, ‘జ్ఞానం’ ఆ వర్ణానికి సంబందించిన వాళ్లకే అన్ని లాభాలు పొందగలిగేలా చేసింది.

jotiba phule

ఈ దేశంలో ఉన్న చాతుర్వర్ణ్య కుల వ్యవస్థ, ఆ జ్ఞానాన్ని, దానితోని ముడిపడి ఉన్న సాంస్కృతిక సంబంధాలను కూడా చాలా వరకు బలోపేతం చేసింది. అలా కేవలం తమ చేతిలో ఉన్న సాహిత్యం, తత్వశాస్త్రం ద్వారా, బ్రాహ్మణీయ సామజిక వ్యవస్థ ఈ దేశంలో కులం ని, బ్రాహ్మణీయ పితృస్వామ్య (brahmanical patriarchy) వ్యవస్థని శాశ్వతం చేసాయి. ఈ అసమానత వ్యవస్థ వల్ల జరిగిన పరిణామాలను, వైరుధ్యాలను మనం ప్రతి రోజు చూస్తూ, భరిస్తూ, బాధపడుతూ కాలానికి మన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయే విధంగా చేస్తున్నాం అని అనడంలో ఎటువంటి సందేహం ఉండదు.

కానీ దేశ సామజిక చరిత్రలో, సమాజం చిట్ట చివరి వ్యక్తి మరియు సమూహం యొక్క దృక్పధం, సమసమాజ నిర్మాణం కోసం చాలా అవసరం. ఆలా ఒక నమ్మకాన్ని, నిర్మాణాన్ని, పోరాటాన్ని ఈ దేశ ప్రజల ముందు ఉంచిన గొప్ప సామజిక విప్లవ దార్శనికుడు ‘మహాత్మా’ జోతిరావు ఫూలే. ‘మాలి’ కులానికి చెందిన (శూద్రుడు, ఇప్పుడు ఓబిసి జాబితాలో ఉంది) జోతిరావు ఫూలే (11-04-1827 to 28-11-1890), మహారాష్ట్రలోని సతారాలో జన్మించాడు.

ప్రముఖ రాజకీయ తత్వవేత్త థామస్ పైన్ రాసిన “రైట్స్ ఆఫ్ మ్యాన్” మరియు అన్ని మత గ్రంథాలను చదివి ప్రభావితమైన జోతిరావు ఫూలే, అన్ని కుల పరిమితులను, అవమానాలను అధిగమించి తనను తాను విద్యావంతుడిగా తయారు చేసుకున్నాడు. చిన్న వయస్సులోనే సావిత్రిబాయితో వివాహం జరిగిన, జోతిరావు ఫూలేను సాంప్రదాయక పద్ధతులు ఏమి ఆపలేదు.

సావిత్రిబాయి మరియు ఫాతిమా షేక్ లకు విద్యను అందించిన జోతిరావు ఫూలే, ఇంకో అడుగు ముందుకెళ్లి 1848 లో భారతదేశంలో అంటరాని బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారు. ఆ కాలంలో ప్రబలంగా ఉన్న బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థ గురించి లోతుగా తెలుసుకున్న ఫూలే, సమాజంలో అసమానతలకు దాని ఆధిపత్య సంస్థ (కుల వ్యవస్థ) కారణమని అర్థం చేసుకున్నాడు.

ఒక సామాజిక విప్లవకారుడిగా ఫూలే తన కాలంలో అట్టడుగు కులాల కోసం కేవలం భౌతిక ప్రయోజనాల కోసం పోరాడటమే కాకుండా, బ్రాహ్మణీయ ఆధిపత్యంలోని అంశాలను అర్థం చేసుకుని, అసమానత కుల సామాజిక నిర్మాణానికి వ్యతిరేకంగా సామూహిక ఉద్యమాన్ని నిర్మించాడు . బ్రాహ్మణిజం అంచుల్లోనుండి శూద్ర-అతిశూద్రులను విముక్తి చేసే పోరాటంలో భాగంగా, ఫూలే అవతారకల్పన (దశావతారాలు) ను తన ‘గులాంగిరి’ రచనలో ఘాటుగా తిరస్కరించాడు. ఆటువంటి ఎన్నో బ్రాహ్మణీయ కథల వళ్ల బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని శాశ్వత, పవిత్రమైన వ్యవస్థగా తయారు చేసి, శూద్ర-అతిశూద్రులను మానసిక బానిసలుగా మార్చారని ఫూలే హెచ్చరించాడు.

మరో ముఖ్యమైన రచన ‘సేద్యగాని చర్నాకోల’లో, ఫూలే రైతుల దుస్థితిని ప్రస్తావిస్తూ, ఏవో పండగల పేరిట రైతులకు వచ్చిన కొద్దిపాటి ఆదాయాన్ని కోల్పోయే విధంగా చేస్తున్న బ్రాహ్మణ పూజారుల కుట్రలను బహిర్గతం చేశాడు. ఫూలే, ఉత్పత్తి పరిస్థితులు-సంబంధాలు, సమాజంలో ఉన్న సామాజిక-సాంస్కృతిక-ఆర్థిక ‘వైరుధ్యం’ (షెట్జీ-భట్జీ వర్సెస్ శూద్ర-అతిశూద్రులు) వల్ల ప్రభావితమవుతాయని నిరూపించాడు.

ఫూలే నడిపిన విముక్తి పోరాటం దేశవ్యాప్తంగా ఇప్పుడున్న కుల వ్యతిరేక (anti-caste) ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. కుల వ్యవస్థ, బ్రాహ్మణిజాన్ని నిర్మూలించడానికి సావిత్రిబాయితో కలిసి ఒక ఉద్యమానికి నాంది పలుకుతూ, ఫూలే 1873 లో సత్యశోధక్ సమాజ్ ను ప్రారంభించాడు. ఆ ఉద్యమం నుంచి తయారైన గొప్ప సామజిక-రాజకీయ బహుజన దార్శనికులే చత్రపతి సాహు మహారాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాన్షిరామ్.

బ్రాహ్మణీయ సామాజిక-సాంస్కృతిక-ఆర్థిక-రాజకీయ అసమానత వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం చేసిన ప్రధాన వ్యక్తిలలో ఫూలే ఒకరు. అందుకే డాక్టర్ అంబేద్కర్, ఫూలే ని “గ్రేటెస్ట్ శూద్ర” గా అభివర్ణిస్తూ తన “శూద్రులు ఎవరు?” పుస్తకాన్ని ఫూలే కి అంకితం చేసాడు. ఇటీవల వచ్చినా “ద శూద్రాస్: విజన్ ఫర్ ఎ న్యూ పాథ్” పుస్తకాన్ని కూడా జ్యోతిబా, సావిత్రిబాయి ఫూలేలకు అంకితం చేసారు సంపాదకులు.

స్త్రీల అణచివేతపై ఫూలే అవగాహన, స్త్రీ ద్వేషపూరిత బ్రాహ్మణీయ గ్రంధాలను విమర్శనాత్మకంగా చదవడం నుండి వచ్చింది. ఫూలే, మహిళలపై జరుగుతున్న సామాజిక అణచివేతపై ప్రత్యక్షంగా దాడి చేశాడు. ఆలా చేయని పరిస్థితుల్లో మహిళల ఆర్థిక, రాజకీయ అణచివేతకు దారితీస్తుందని ఫూలే భావించాడు. అసమానతలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భాగమైన పండిత రామాబాయి, తారాబాయి షిండేల ను అగ్రవర్ణాలు అవమానించడాన్ని ఫూలే వ్యతిరేకించాడు. ఆ కాలంలో అనేక సామాజిక సంస్కరణ సంస్థలు ఉన్నప్పటికీ, అవి కేవలం అగ్రవర్ణ కుటుంబంలో అసమాన నిర్మాణాలను సంస్కరించడానికి ప్రయత్నించాయి, కానీ ఫూలే దంపతులు తలపెట్టిన ఉద్యమం లాగా, బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థను పూర్తిగా ఎదుర్కోలేకపోయాయి. అందుకే ఫూలే ను శూద్ర సామజిక విప్లవానికి దార్శనికుడిగా అభివర్ణిస్తారు.

ఫూలే, మహిళల అణచివేత ప్రశ్నను ప్రస్తావిస్తూ కుల, లింగ కేటగిరీని జోడించి (intersection of caste and gender), మహిళల అణచివేత ముగింపు, బ్రాహ్మణీయ శాస్త్రాలు/వేదాలను పూర్తిగా తిరస్కరించడంలోనే ఉందని చెప్పాడు. ఆ శాస్త్రాలు అన్ని కులాల మహిళల గురించి హానికరమైన నిబంధనలకు పునాది వేసాయని ఫూలే తన రచననలో వివరించాడు. అన్ని కులాల మహిళలు ‘అణచివేత’కు గురైనట్లు అర్థం చేసుకున్నప్పటికీ, అందరి స్థితులను ఎప్పుడూ సజాతీయంగా మార్చలేదు ఫూలే. ఈ పద్ధతికి బిన్నంగా, ప్రస్తుత భారతీయ స్త్రీవాద ఉద్యమం మాత్రం మహిళలను ఒకటిగా చూస్తూ, అణగారిన కులాల మహిళల సమస్యలను విస్మరిస్తూ, ఫూలే దంపతులని స్త్రీవాదులుగా గుర్తించక పోవడం ఎన్నో ప్రశ్నలకు దారితీస్తుంది.

‘కులాంబిన్’ (A Peasant Woman) అనే కవితలో, వారి శారీరక, మానసిక పనిలో నిమ్న కులాల స్త్రీలు మరియు అగ్రవర్ణ స్త్రీల మధ్య వ్యత్యాసాన్ని ఫూలే స్పష్టంగా వివరించాడు. ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసిన తరువాత శూద్ర మహిళలు, అగ్రవర్ణాల ఇళ్లలోకి వెళ్లి పని చేస్తారని రాస్తూ, ఫూలే ఇలా వివరించాడు “కష్టపడి పనిచేసే రైతు మహిళ, భట్ (బ్రాహ్మణ) మహిళ లాగా చల్లని నీడలో కూర్చునే విలాసవంతమైనది కాదు.”

శూద్ర-అతిశూద్ర మహిళగా, తాను కుల అవమానాన్ని/అంటరానితనాన్ని ఎదుర్కొంటుంది, ఒక మహిళగా, నిరంతరం ఇంటిచాకిరికే పరిమితమవుతుందని ఫూలే భావించాడు. శూద్ర-అతిశూద్ర కులాలలో ఉన్న పితృస్వామ్యాన్నీ కూడా వ్యతిరేకించాడు ఫూలే.

సత్య శోధక్ సమాజ్ ఆధ్వర్యంలో, సతి, బలవంతపు వితంతువు, బాల్యవివాహాలు, బాల్య హత్యలకు (గర్భస్రావం/శిశుహత్యలు) వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి నాయకత్వం వహించాడు ఫూలే. అన్ని రకాల అణచివేతలను అంతం చేయడానికి, ఫూలే, మహిళలకు తప్పనిసరి విద్యను సూచించాడు; అలాగే మహిళల పట్ల పరిమితులను శాశ్వతం చేసిన బ్రాహ్మణీయ గ్రంథాలను తిరస్కరించాలాని ఆదేశించాడు. ఈ విధంగా సావిత్రిబాయితో కలిసి, బ్రాహ్మణీయ పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక రేడికల్ ఉద్యమానికి పునాదులు వేసాడు, ఫూలే.

మహాత్మా ఫూలే 1855 లో శ్రామిక వర్గాల కోసం రాత్రి పాఠశాలలను కూడా ప్రారంభించాడు. అసమానతల సామాజిక నిర్మాణం గురించి వారికి అవగాహనా కల్పిస్తూ, విగ్రహారాధన, మద్యం సేవించడం మానేయమని సలహా ఇచ్చాడు. భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ఏర్పడటానికి చాలా ముందే, ఫూలే కార్మికులను సమీకరించి వారి హక్కుల కోసం పోరాడాడు. 1888 లో ‘మహాత్మా’ అనే బిరుదుని మాండ్వి ప్రజలు ఫూలే కు ఇవ్వడం జరిగింది.

అయితే ఇక్కడ మనం ఒక విషయాన్నీ గమనించాలా. ఈ దేశానికి మహాత్ముడు అయినా గాంధీ తన ఆలోచన విధానంలో సనాతన ధర్మానికి తగిన చోటు కల్పించాడు. ఆధునిక దేశ నిర్మాణంలో, చరిత్రను ఎవరు, ఎలా రాసారనేది ఎంత ముఖ్యమో, భవిష్యత్తు కి ఎటువంటి విలువలపై పునాదులు వేశారనేది కూడా అంతే ముఖ్యం. అయితే ఇక్కడ ఇద్దరు మహాత్ములు ఇచ్చిన ఆలోచన విధానాన్ని గమనిస్తే మనకు చరిత్రని ఎలా అర్థం చేసుకోవాలనే వివరణ దొరుకుతుంది.

ఉదాహరణకు, శూద్రత్వం అంటే పనితత్వం అని చాలా గొప్పగా చెప్పుకుంటారు ఎంతో మంది అగ్రవర్ణ ద్విజులు (twice born). అంటే ఎవరైనా శూద్రత్వాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ శూద్రులు భూదేవులకు వరం అయిన సనాతన బ్రాహ్మణత్వాన్ని మాత్రం పొందలేరు. పనితత్వం అంటే లేబర్ వర్క్ కి గౌరవం ఇవ్వటం, ఈ పద్దతి బ్రాహ్మణిజానికి అలవాటు లేదు. ఇక్కడ పనితత్వం అంటే పై వర్ణాలకు సేవ చేయటం అని. బ్రాహ్మణులకు సుపీరియర్ స్టేటస్ ఉంటే, శూద్రులకు సర్వీస్ స్టేటస్ ను అంటగట్టాయి ఈ బ్రాహ్మణ సాహిత్యం, తత్వం. మనుస్మృతి కూడా శూద్రులు పుట్టుకతో బానిసలూ (Manusmriti, chapter 8, verses 410, 413, 414, 418) అని పేర్కొంది. దీనిని గాంధీ కూడా ఆచరించాడు అనే సత్యాన్ని మనకు చరిత్ర చెప్పదు.

గాంధీని ‘చతుర్ బనియా’ అని ఇటీవల అమిత్ షా వర్ణించడం మనకు తెలిసిన సంగతే అయితే వాస్తవానికి గాంధీ చాలా తెలివిగా శూద్రుల సేవా గుణాన్ని పొగుడుతూ దాన్ని శాశ్వతం చేసే ప్రయత్నం చేసాడు. 1933 లో వర్ణధర్మ వ్యవస్థ ను సరిచేయడం ఎలా అనే అంశం పై రాస్తూ గాంధీ ఈ విధంగా అన్నాడు “తన విధిని విస్మరించే బ్రాహ్మణుడి కంటే తనకు తగిన కర్తవ్యాన్ని చేసే శూద్రుడే ఉత్తమం” (A shudra who does his appropriate duty is better than a Brahmin who discards his duty).

 

అయితే ఇక్కడ రెండు విషయాలను మనం గమనించాలా. ఒకటి తనకు కేటాయించిన పనిని ఒక బ్రాహ్మణుడు ఎంత ధైర్యంతో విస్మరించ గలుగుతాడో అంతే దైర్యం, కోపంతో ఒక శూద్రుడు తనను తక్కువ చేసి చూసే పనిని విస్మరించలేడు. ఆలా వర్ణ వృత్తిని వదులుటకు వర్ణధర్మం ఒప్పుకోదు. గాంధీ కూడా ఇటువంటి ప్రశ్న వేసుకుంటే బాగుండేది. అసలు శూద్రుడు తనకు తగిన కర్తవ్యాన్ని చేసి ఉత్తముడు అని ఎందుకు పిలుపించుకోవాలి? అందుకే చరిత్రలో VIEW FROM BELOW దృక్పథం చాలా అవసరం. అటువంటి దృక్పథం ఇచ్చిన మహాత్మా ఫూలే ఉద్యమం ద్వారా, ‘చతుర్ బనియా’ అయిన గాంధీ చెప్పిన విషయాన్నీ మనం ఇంకో విధంగా అర్థం చేసుకోవచ్చు i.e. “తనకు కేటాయించిన విధిని చేసే బ్రాహ్మణుడి కంటే, తనకు తగని కర్తవ్యాన్ని విడిచిపెట్టిన శూద్రుడే ఉత్తమం” (A shudra who discards and abandons his/her appropriate duty is better than a Brahmin who does his ascribed duty).

 

ఇది ఇలా ఉండగా, నేడు అగ్రవర్ణాలు మరియు పాలక వర్గాలు, ఫూలేని కేవలం ఒక విద్యావేత్తగా గుర్తిస్తారు. విద్యను, విముక్తి శక్తిగా ఫూలే అభివర్ణించడం సమావేశాల్లో వింటూవుంటాం. కాని 1882 లో ఫూలే హంటర్ కమిషన్కు (Hunter Commission) సమర్పించిన సిఫార్సులు ఎక్కువగా చర్చలో ఉండవు. తప్పనిసరి-ఉచిత ప్రాథమిక విద్య అవసరాన్ని గుర్తిస్తూ (విచిత్రం ఏమిటంటే విద్యాహక్కు చట్టం 2009 లో అమలు చేయబడింది), ఉన్నత విద్యలో ప్రభుత్వ నిధులు ఉపసంహరించుకోవడం వల్ల అణగారిన వర్గాలకు ఎక్కువ కష్టాలను తెచ్చిపెడుతుందని ఫూలే హెచ్చరించాడు.

ఫూలే ఏ విధంగానైతే హెచ్చరించాడో మనం ప్రస్తుత విద్య సంక్షోభంలో కళ్లకు కట్టినట్టుగా కష్టాలను, నష్టాలను చూస్తున్నాం. అర్ఎస్ఎస్ అండతో బీజేపీ ప్రభుత్వం ఉచిత విద్యను అందించడంలో రాష్ట్ర సంక్షేమ పాత్రను వెనక్కి తీసుకుని దానికి బదులుగా విద్యా సంస్థలను అగ్రవర్ణ కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తుంది. ఐఐటి మొదలైన వాటిలో ఫీజుల పెంపు, వివిధ విద్యా సంస్థలలో నిధుల కోత, పరిశోధనా విద్యార్థులకు ఫెలోషిప్ ఆపే ప్రతిపాదన, రిజర్వేషన్ల అమలులో పూర్తి నిర్లక్ష్యం, ఇంటర్వ్యూలలో తక్కువ మార్కులు వేయడం, పెరుగుతున్న కాషాయీకరణ/బ్రాహ్మణీకరణ, క్యాంపస్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ప్రాజెక్ట్ మొదలైనవి ఇప్పుడు ఉన్నత విద్యలో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలుగా మనం చూడొచ్చు. విద్యకు ఉన్న శక్తిని ఫూలే ఈ విధంగా వివరించాడు “శూద్రులు, అతిశూద్రులు మీ (బ్రాహ్మణ) స్త్రీల వలె విద్యను పొందే అవకాశాన్ని ఎప్పుడైనా పొందినట్లయితే, మీరందరూ (ఆర్య బ్రాహ్మణులు) మీ బ్రాహ్మణత్వాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది”.

ఇటీవల విశ్వవిద్యాలయాలలో జరుగుతున్న ‘సంస్థాగత హత్యలు’ (ఆత్మహత్యలు), బ్రాహ్మణీయ సామాజిక-సాంస్కృతిక ఆధిపత్యానికి ఉన్న అధికార సంబంధాన్ని మనకు ప్రతిరోజు గుర్తుచేస్తూ ఉంటాయి. విశ్వవిద్యాలయాలను ఆధునిక అగ్రహారాలుగా మార్చి అట్టడుగు వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యవైపు చూడకుండా చేయడంలో బ్రాహ్మణీయ శక్తులు నిరంతరం కృషి చేస్తున్నాయి. దేశంలో, ముఖ్యంగా క్యాంపస్లలో వివక్షకు వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలు జరిగినప్పటికీ, శూద్ర-అతిశూద్ర వర్గాల మేధో సామర్థ్యాన్ని నాశనం చేసే అజెండాను కొనసాగిస్తున్నాయి. ఈ నిరంతర సమస్యకు పరిస్కారం ఫూలే చెప్పినట్టు “శూద్రలు-అతిశూద్రలు చదువుకునే పాఠశాలలో, బ్రాహ్మణ మాస్టర్స్ ఉండకూడదు” అనే దాంట్లోనే ఉన్నదా?

ప్రస్తుత వితండవాద జాతీయవాదం పేరుతో అర్ఎస్ఎస్-బీజేపీ చేస్తున్న సమీకరణలు దేశాన్ని సామూహిక ఐక్యమత్యం వైపు అడుగులు వేయించే పని అస్సలు కాదు. ఫూలే, జాతీయవాదానికి ఉన్న పరిమితులని గ్రహించి సామజిక విప్లవానికి, ప్రజాస్వామ్యానికి కావాల్సిన మౌలిక ప్రమాణాలను వివరిస్తూ ఇలా అన్నాడు “బలి రాజ్యంలోని ప్రజలందరూ [శూద్రులు, అతి-శూద్రులు, భిల్స్ (ఆదివాసీలు), మత్స్యకారులు మొదలైన వారు] నిజమైన విద్యావంతులుగా మరియు స్వతంత్రంగా ఆలోచించగలిగేంత వరకు పేరుకు తగిన ‘దేశం’ ఉండదు”.

ఇప్పుడు దేశంలో, ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో, అణగారినవర్గాలు భావోద్వేగ సమైక్యత, స్వతంత్ర ఆలోచన కు ఇంకా దూరంగానే ఉన్నారు. దేశంలో సామాజిక ఆలోచన, భావన తిరోగమనంలో ఉంటూ, సామజిక సంఘీభావం లేకుండా సామజిక దూరాన్ని శాశ్వతం చేసే వైపు అడుగులు వేస్తుంది. కేవలం జాతీయవాదం, దేశభక్తి నినాదాలు హేతుబద్ధత యొక్క ఆలోచన, విలువను ప్రచారం చేయవు. సత్యాన్వేషణ, విజ్ఞాన శాస్త్రం, హేతుబద్ధత, విద్య, సామజిక ప్రజాస్యామ్యం, మహిళా విముక్తి, రేడికల్ సమానత్వం లాంటి విలువలు ఈ అసమానతల దేశం యొక్క సమూల పరివర్తనకు ప్రాథమిక అవసరాలు. ఈ విలువలను దేశానికి పరిచయం చేసినందుకే ‘మహాత్మా’ జోతిరావు ఫూలే (శూద్ర) సామాజిక విప్లవానికి దార్శనికుడు.

~~~

 

ఫూలే-అంబెడ్కర్ వాది అయిన మణికంఠ, తెలంగాణ వాసి. రాజనీతి శాస్త్రంలో పరిశోధన చేస్తూ, డిగ్రీ విద్యార్థులకి సంబంధిత సబ్జెక్టు పాఠాలు బోధిస్తున్నాడు. ఇతర రచనలకు https://independent.academia.edu/PallikondaManikanta